1, మార్చి 2011, మంగళవారం

boi bimann rachanalu

డా॥బోయి భీమన్న సుమారు 70 పుస్తకాల్ని రాసినట్లు తెలుస్తుంది. పద్య,గేయ,వచన రచనలతో పాటు, నాటకాలను కూడా రాశారు. వివిధ పుస్తకాలకు రాసుకున్న పీఠికల్లో పరిశోధనాత్మక దృష్టి కనిపిస్తుంది.వాటిలో కొన్నేవో కొత్తప్రతిపాదనల్ని, కొత్త సిద్ధాంతాల్నీ చెప్తున్నట్లుంటుంది.ఆకాశవాణిలో ప్రసారం కోసం అనేక భావగీతాల్ని రాశారు. వీటన్నింటితో పాటు అంబేద్కర్‌ రాసిన కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించడంతో పాటు, ఆయన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని కీర్తిస్తూ రాశారు.వీరు రాసిన ‘‘జయ జయ జయ అంబేడ్కర!’’ దళితులకు జాతీయగేయమై నేటికీ ఊరూరా ప్రార్థనా గీతంగా మార్మోగుతుంది.
పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు డా॥బోయి భీమన్నపేరుతో ఒక సాహిత్య పీఠాన్ని ఏర్పాటు చేసి, వీరి రచనలన్నింటినీ ప్రచురిస్తున్నారు.నిజానికివన్నీ విశ్లేషిస్తే గాని,భీమన్న సమగ్ర సాహిత్య దృక్పథం స్పష్టం కాదు.ఈయనే కాదు, ఏ రచయిత దృక్పథాన్నైనా అంచనా వేయాలంటే, వివిధ పరిణామాలుగా సాగిన రచనలన్నింటినీ స్పర్శించగలిగినప్పుడే ఇది సాధ్యమవుతుంది. అలా కాకుండా, దళిత పదాన్ని ప్రయోగించలేదనీ, దాన్ని వ్యతిరేకించాడనీ, భారతదేశంలో కులం లేదన్నారనీ, ఆయన వర్గాన్నే సమర్ధించారనీ, కులం గురించి రాయలేదనీ వక్రీకరించే వాళ్ళుని చూసిన తర్వాత ఆయన సాహిత్యదృక్పథాన్ని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. 
ఇప్పటికే అనేకమంది భీమన్న రచనలపై పరిశోధనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ సదస్సులు జరుగుతున్నాయి. వీటన్నింటికీ ఒక మార్గదర్శనాన్ని కల్గించిన గ్రంథం ఒకటి ఉంది. అది శ్రీమతి హైమావతీ గారు చక్కని కథనాత్మక శైలిలో రాసిన ‘‘పాలేరు నుండి పద్మశ్రీ వరకు బోయిభీమన్న’’ గ్రంథం. ఇది వీరి సాహిత్య దృక్పథాన్ని తెలిపే చుక్కానిలాంటిది. దానిలోని సూచనల్ని గమనిస్తే,ఆయన రాసిన రచనల్లో పరిశోధకులకు,విమర్శకులకు తమదైన విశ్లేషణకు ప్రేరణ దొరుకుతుంది.భారతదేశంలోని భిన్నత్వంలోని ఏకత్వంలాగే, భీమన్న రచనల్లోనూ ఆ లక్షణం కనిపిస్తుందనీ, ఆయన కుల,మతాల కంటే మానవత్వాన్నే ఆశించిన జాతీయవాది అనీ ఆ గ్రంథం ప్రతిపాదిస్తుంది.
భారతజాతీయదృక్పథంలో అంతర్భాగంగా ప్రవహించే హిందూమతంలో కులాన్ని ప్రత్యేకంగా విశ్లేషించుకోవాలి.అంబేద్కర్‌ విశ్లేషించిందీ,భీమన్న రాసిందీ అదే! తన జీవితాంతం ఆయన జాతీయవాదిగానే ఉన్నారు.జాతీయతలో తాను పుట్టి పెరిగిన దేశీయవాస్తవికతకు అనుగుణంగా ఉంటూనే, ఆత్మగౌరవంతో జీవించాలనే ఆకాంక్ష ఉంటుంది.
ఒకప్పుడు ‘‘బ్రాహ్మణ’’ శబ్దాన్ని చదువుకున్నవాళ్ళకీ, ఆలోచనాపరుల్నీ సూచించడానికీ ప్రయోగించారు.సామాజిక నిర్మాణంలో చాతుర్వర్ణవ్యవస్థలోకి చేరిన తర్వాత కులసూచికగా మారిపోయింది. తమ తెలివితేటలతో ఆధిపత్యంలో ఉన్న వాళ్ళు, క్రమేపీ ఒక వర్గంగా తయారైయ్యారు.ఈ ఆలోచనాపరులు ఒక క్రమబద్ధమైన జీవన విధానాన్ని మతమని ప్రబోధిస్తూనే, ఆచార, వ్యవహారాల పేరుతో, కర్మ సిద్ధాంతం వైపు నడిపించుకొనిపోయిన హిందూమతంపైనే డా॥ అంబేద్కర్‌ ముందుగా తన దృష్టిని కేంద్రీకరించారు.కొన్ని వందలసంవత్సరాలుగా పాతుకుపోయిన హిందూమతంతో అవినాభావసంబంధాన్ని కలిగి ఉన్న వాళ్ళు, తమకు బోధించిన ధర్మశాస్త్రాల వల్ల మానసికంగా, అస్పృశ్యులుగా ఉండిపోవడానికైనా సిద్ధపడతారు. పురాణేతిహాసాలు,సంప్రదాయ సాహిత్యాల పేరుతో పాలకవర్గాలతో ‘‘ఆలోచనాపరులు’’ కలిసి కొనసాగించిన కుట్ర ఫలితంగా, నేటికీ కులాధిపత్యసాహిత్యమే ఉత్తమసాహిత్యంగా కొనసాగిపోతోంది. దురదృష్టమేమిటంటే, నాటిభావజాలాన్ని నేటికీ కొనసాగించడాన్ని ఆ భావజాలం వల్ల నష్టపోయిన, ఇంకా నష్టపోతున్న వాళ్ళు వ్యతిరేకిస్తుంటే, నాటి ఆధిపత్య భావజాలానికి ప్రతినిధుల్లా వాటిని సమర్ధించేవాళ్ళు కొంతమంది తయారయ్యారు. అందుకనే తన ప్రజలంతా దేని వల్లనైతే మోసపోతున్నారో, దాన్నుండి రక్షించుకోవడానికి ప్రత్యక్షంగా సామాజిక ఉద్యమాన్ని నడిపే బాటలో పయనించిన వాడు అంబేద్కర్‌. అలాంటి ఆశయాన్నే సాహిత్యంలో కొనసాగించిన రచయిత బోయిభీమన్న కూడా!
డా॥బోయిభీమన్న సమగ్రసాహిత్యం పేరుతో మొదటి సంపుటిని తెలుగు విశ్వవిద్యాలయం వారు ఇటీవలే విడుదల చేశారు. దీనిలో ‘‘పాటలలో అంబేద్కర్‌’’ (పుటలు : 306 - 462 ) ఉంది. దీనిలో అంబేద్కర్‌ వ్యక్తిత్వాన్ని,భావజాలాన్ని వర్ణించిన 118 పాటలున్నాయి.దీనిలోనే భీమన్న అనేక పాటల్లో దళిత పదాన్ని ప్రయోగించారు. కానీ, దళిత పదాన్ని వాడడం ఇష్టం లేదని ఆయన తన చివరి రోజుల్లో ప్రకటించారు.దానికి అనేక కారణాలున్నాయి. దాన్ని మరోసారి చర్చించుకుందాం.‘‘దళిత జనులకంబేడ్కరు, ధర్మమె మతమన్నాడు, బౌద్ధధర్మమొకటేరా,భారతీయమన్నాడు’’అని ఒక చోట, ‘‘ దళితులనుద్ధరించని ధర్మం కుంటిదంటూ..’’ ఒక పాటకు దళిత పదాన్ని శీర్శికలోనే పెట్టిమరీ మరోచోట రాశారు.దళితుల్ని ఈయన అవర్ణులు, పంచములు, హరిజనులనే పేర్లతో వర్ణించడం కనిపిస్తుంది. 
కులనిర్మూలనను బలంగా వ్యతిరేకించిన నాటకం పాలేరు. 1988 నాటికి పాలేరు నాటకానికి ఏభై యేళ్ళైందని రచయితే చెప్పుకున్నారు. అంటే, ఆ నాటకం 1938లో రాసినట్లు స్పష్టమవుతుంది.
 భీమన్న రాసిన ‘‘పాలేరు’’ నాటకంలో వెంకన్నావనబాలల ప్రేమకథలోను,1959లో రాసిన ‘‘రాగవాసిష్ఠం’’ నాటకంలో గల అరుంధతీావశిష్ఠుల ప్రణయగాథలోను, మరికొన్ని రచనల్లోను కులాంతర వివాహాల పేరుతో కులనిర్మూలన అవకాశాల్ని చర్చించారు.

 
సమాజంలో కులం వల్ల గౌరవం పొందుతున్న కుటుంబం నుండి వచ్చిన వనబాల, కులం వల్ల సమాజంలో అవమానాలకు గురౌతున్న వెంకన్న పరస్పరం ప్రేమించుకుంటారు. పాలేరుగా పనిచేయాల్సిన వాడు, అగ్రకులంగా గౌరవమర్యాదల్ని పొందుతున్న అమ్మాయిని పెండ్లి చేసుకోవాలంటే, ఎన్ని బాధలకు గురికావాల్సివస్తుందో, అన్నింటినీ అగ్రకుల, భూస్వామి కుభేరయ్య వల్ల పాలేరు వెంకన్న ఎదుర్కొంటాడు.చివరికి ‘‘ఉపకారి’’ మాస్టారు సహాయంతో చదువుకుని వెంకటేశ్వరరావుగా గౌరవం పొంది,డిప్యూటీ కలెక్టరుగా ఉన్నతోద్యోగం సాధిస్తాడు.ఉద్యోగిగా తన గ్రామానికే వచ్చి, భూస్వాముల దురాగతాలను చట్టబద్ధంగా అడ్డుకుంటాడు. అస్పృశ్యతను పాటించే వాళ్ళనీ, ప్రోత్సాహించేవాళ్ళనీ నిరోధిస్తాడు. ప్రజాస్యామ్యబద్ధంగా దళితులు తమ హక్కుల్ని సాధించుకోవాలనే అంబేద్కర్‌ ఆశయాన్ని దీని ద్వారా ప్రేరేపించారు రచయిత.
సమాజంలోని వాళ్ళంతా చెడ్డవాళ్ళే కాదనీ, మంచివాళ్ళూ ఉంటారనేది భీమన్న సాహిత్యంలో కనిపించే ఒక విశిష్ట గుణం.ఈ పాలేరు నాటకంలో వనబాల కూడా అగ్రవర్ణానికి చెందిన కుంటుంబం నుండే వచ్చినా,సంకుచిత మూర్ఖకులతత్వ వాదులు లేని వాళ్ళూ ఉంటారనే మరో పార్శ్వాన్ని కూడా చూపారు.
వెంకన్న తండ్రి పుల్లయ్య తన తండ్రి బాటలోనే తానూ పయనించి, తన కొడుకునీ పాలేరుతనానికి పంపుతాడు.అలాంటి సేవ చేయడానికే తాము జన్మించామనే భ్రమను కల్పించి, కొన్ని తరాలుగా కర్మసిద్ధాంతం పేరుతో దళితుల్ని అగ్రవర్ణభూస్వాములు వంచించిన తీరుతెన్నుల్ని ఈ నాటకం ద్వారా వివరించారు.
          నిజజీవితంలో అటు అంబేద్కర్‌, ఇటు భీమన్న ఇరువురి జీవితాల్నీ పాలేరు నాటకం స్ఫురింపజేసేటట్లుంది. ఇరువురూ కులం వల్ల అనేక అవమానాల్ని ఎదుర్కొన్నవాళ్ళే. ఇరువురూ చదువుకోవడం వల్లనే అనేకమంది దళితులకి ఆదర్శం కాగలిగారు. యాదృచ్ఛికంగా ఇరువురూ కులాంతర వివాహాలనే చేసుకున్నారు. తాము చెప్పిన వాటిని నిజజీవితంలో ఆచరించి చూపి మరీ ఆదర్శవంతులైయ్యారు.
రాగవాసిష్ఠంలో అరుంధతీదేవి మాహాత్మ్యాన్ని వివరించడానికి, పురాణేతిహాసాల్లోని కులాంతర వివాహాల్ని సృజనీకరణ ప్రతిభతో భారత జాతీయదృక్పథాన్ని ప్రదర్శించారు. దీనికి ఆర్యద్రావిడ వాదాల్ని కూడా నాటకంలో అంతర్భాగం చేశారు.
సనాతన సంప్రదాయవాది భావాల్ని ‘‘ప్రాచీనుడు’’ అనే పాత్ర ద్వారా వర్ణించారు.నిష్కళంకమైన ప్రేమకు సంప్రదాయం ఎలా అడ్డంకిగా మారుతుందో వివరిస్తూనే, ఆ ప్రేమలో నిజాయితీ ఉంటే, అన్నింటినీ జయిస్తుందని నిరూపించారు.కుల నిర్మూలనకు కులాంతర వివాహాలు తోడ్పడతాయని చెప్పినట్లైనా, తర్వాత వాళ్ళకు పుట్టే పిల్లల సామాజిక స్థితి గతుల్ని చర్చించవలసిన అవసరం ఉంది. నేడు కులాంతర వివాహాలు జరిగినా, మళ్ళీ తండ్రిది గానీ, తల్లిదిగాని కుల గుర్తింపేవస్తే, కులనిర్మూలన జరిగినట్లెలా అవుతుందో ఆలోచించాల్సిందే!
‘‘గుడిసెలు కాలిపోతున్నై’’ (1973) కావ్యంలో ఏడాదికోసారి దళితుల గుడిసెలెందుకు కాలిపోతున్నాయో, మరలా కొత్తగుడిసెలు మాత్రమే ఎందుకు వస్తున్నాయో ఓట్లకోసం వచ్చేవారిని నిలదీసే చైతన్యం దళితుల్లో కలగాలనే ఆశయం కనిపిస్తుంది. చీమలను శ్రామిక దళితులకు, పాములను కులదోపిడీదారులకు ప్రతీకలుగా చేసి దానిలో వర్ణించారు. దళితుల మధ్య ఉండాల్సిన సమైక్యత ప్రబోధిస్తారు. తమని ‘‘కూలిరాజు’’ (1946) నాటకంలో కులంతో పాటు ఆర్థికాంశాల్ని కూడా స్పర్శించారు.‘‘ధర్మం కోసం పోరాటం’’’లో బహుజనులంతా రాజ్యాధికారదిశగా పయనించడానికి సూచనలు చేశారు.
వాల్మీకి, వేదవ్యాసుడు, ధర్మవ్యాధుడు మొదలైన వాళ్ళు దళితులేనని వాదిస్తూ, వాళ్ళు రాసిన భారత, రామాయణ, భారతాలు తమవేనని చెప్పడంలో భీమన్న దృక్పథాన్ని లోతుగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. 
హింసావాదానికి భీమన్న వ్యతిరేకి. దళితులందరూ శ్రామికులనే వారిని భీమన్న వ్యతిరేకించారు. కమ్యూనిస్టుపార్టీలో పనిచేసి, కులం, వర్గం వేరని వాదించిన కోనాడ సూర్యప్రకాశరావుకి పాలేరు నాటకాన్ని అంకితమిచ్చారు. భీమన్న రచనల గురించి మాట్లాడుతున్న వాళ్ళు మూడు ప్రధానాంశాల్ని గుర్తించాలి. ఆర్య`అనార్య సిద్ధాంతాన్ని అంబేద్కర్‌ ఆలోచనతోనే రాగవాసిష్ఠంలాంటి నాటకాన్ని రాశారు. రెండవది వర్ణం విషయంలో భారతదేశంలో కులమనే అవగాహన చేసుకోవాలి. ఇది ప్రపంచదేశాలన్నింటికీ సమన్వయించినప్పుడు కుదరదు. దీన్ని కూడా అంబేద్కర్‌ ఆంత్రోపాలజీ, సామాజిక శాస్త్రాల్ని ఆధారంగా చేసుకుని చెప్పిన సిద్ధాంతమే. దీన్నే భీమన్న కూడా తన రచనల్లో సమన్వయించారు. పాలేరు నాటకానికి రాసిన ముందుమాటలో భీమన్న స్పష్టంగానే వర్గం,కులం పట్ల తన అభిప్రాయాల్ని ప్రకటించారు.‘‘భారత్‌లో వర్గపద్ధతి ( class) లేదు. వర్ణవ్యవస్థ అంటే కుల వ్యవస్థ (caste system system) వుంది. ఇక్కడ కూలీలంతా అభ్యుదయం సాధించాలంటే ముందుగా అంటరానితనాన్ని తొలగించాలి’’ అన్నారు. వర్గపోరాటాలు జరుగుతున్న తీరుని విమర్శిస్తూ ‘‘ నాయకులంతా దేశీయ స్థితిగతులను గుర్తించకుండా ప్రపంచ కార్మిక దృష్టిమాత్రమే కలిగిన ధనిక సవర్ణులు’’ అని ప్రకటించారు.ఇంత స్పష్టంగా కులనిర్మూలనను ఆశించిన భీమన్న సాహిత్యాన్ని వివిధ జాతీయసదస్సుల్లో కులం లేదన్నారని వక్రీకరిస్తున్నారు. మూడవది వర్ణాంతవివాహాల వల్ల కులనిర్మూన జరగడాన్ని ఆకాంక్షించారు. ఈ విషయాలన్నీ బాధ్యతగల సాహితీవేత్తలు గుర్తించాల్సిన అవసరం ఉంది.అంబేద్కర్‌ భావజాలానికి సాహిత్య ప్రతిఫలనమే భీమన్న సాహిత్యమని గుర్తించాల్సి ఉంది.  
-డా.దార్ల వెంకటేశ్వరరావు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి