1, మార్చి 2011, మంగళవారం

పైన పటారం - సంపాదకీయం

పైన పటారం
- సంపాదకీయం

ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సోమవారం నాడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2011-12 వార్షిక బడ్జెట్‌లో అపారమైన ఆయన రాజకీయ అనుభవం, రాజనీతిజ్ఞత కొట్టవచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. పైకి పూర్తిసాదా సీదాగా, గొప్ప సృజనాత్మకత ఏదీ లేనట్టుగా కనిపిస్తున్న ఈ బడ్జెట్‌లో ప్రణబ్ దాదా లౌక్యం, గడుసుదనం అంతర్లీనంగా దాగి ఉన్నాయి.

యు.పి.ఎ. ప్రభుత్వ ఎజెండాను ముందుకు తీసుకోవడంలో ఆయన తనదైన చాణక్యాన్ని ప్రదర్శించారు. మార్కెట్ సంస్కరణల మోజును బాహాటంగా ప్రదర్శించి జనాగ్రహానికి గురికాకుండా, జనాకర్షణకు పెద్దపీటవేసి మార్కెట్ శక్తుల నిరసన ఎదుర్కోకుండా... సమతుల్యాన్ని ప్రదర్శించేందుకు అసిధారా వ్రతాన్ని ఆయన విజయవంతంగా నిర్వహించారు.

వేతన జీవులకు పన్ను మినహాయింపు పరిమితిని లక్షా అరవై వేల రూపాయ ల నుంచి లక్షా ఎనభై వేల రూపాయలకు పెంచారు. ఈ నామమాత్రపు పెంపుద ల వల్ల ఉద్యోగులకు ఒనగూడే లాభం కేవలం నికరంగా రెండు వేల రూపాయ లు మాత్రమే. గత ఏడాది కాలంలో అసాధారణస్థాయిలో దూసుకుపోయిన ధరలు మధ్యతరగతి జీవితాన్ని దుర్భరం చేశాయి. పెరిగిన జీవన వ్యయంలో ఈ రెండు వేలు ఏ పాటి అన్న విషయం ఆలోచించాలి. పన్నుల మినహాయింపునకు సంబంధించి కొత్తగా సృష్టించిన అతి వయోవృద్ధుల విభాగం వల్ల ఎంతమంది లబ్ధిపొందుతారో చూడాల్సి ఉంది.

80 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్స్‌కు ఐదు లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు పరిమితిని ప్రణబ్ ప్రకటించారు. అంగన్‌వాడి ఉద్యోగుల వేతనాలను ఏకంగా నూరు శాతం మేర పెంచా రు. సామాజిక రంగాల వ్యయాన్ని 17 శాతం మేర పెంచుతున్నట్టుగా వెల్లడించారు.

80 ఏళ్లు దాటిన వృద్ధుల పింఛనును 200 రూపాల నుంచి 500 రూపాయలకు హెచ్చిస్తున్నట్టుగా వెల్లడించారు. విద్య, వైద్యం వ్యయాన్ని కూడా గత బడ్జెట్‌తో పోలిస్తే కేటాయింపులను పెంచారు. గ్రామీణ గృహనిర్మాణ నిధిని 3000 కోట్ల రూపాయలకు పెంచారు. ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థుల స్కాలర్‌షిప్‌లను ప్రకటించారు. స్థూలదృష్టికి ప్రజాకర్షక బడ్జెట్‌గా ముస్తాబు చేసినట్టు కనిపిస్తు న్నా, సూక్ష్మంగా ఆలోచిస్తే ఈ బడ్జెట్ ప్రతిపాదనలు మధ్యతరగతి నడ్డి విరిచే అవకాశం ఉంది.

సగటు జీవుల బతుకులను దుర్భరం చేసిన నిత్యావసరాల ధరలు, దేశీయ ఆర్ధిక రంగాన్ని విశేషంగా ప్రభావితం చేస్తున్న అంతర్జాతీయ ముడి చమురు ధర లు, జాతి ప్రజలందరి ఆగ్రహానికి కారణంగా మారిన అవినీతి, న్యాయస్థానాలు సైతం పరుషంగా వ్యాఖ్యానిస్తున్న నల్లధనం... వీటి విషయంలో స్పష్టమైన కార్యాచరణ ఏదీ బడ్జెట్‌లో కానరాలేదు. వ్యవసాయం, మౌలిక వసతుల రంగం, గృహనిర్మాణం వీటికి ప్రాధాన్యం లభించింది.

ఆర్ధిక రంగంలో కార్యకలాపాల జోరు కొనసాగాలంటే మౌలిక వసతులు, గృహనిర్మాణ రంగాల్లో వ్యయం తప్పనిసరి. వేడిని రాజేసే ఈ రంగాలకు ఇతోధిక ప్రాధాన్యం ఇస్తూ అదే సమయంలో ఈ ఏడాది మొదటిసారిగా 5 శాతంపైగా వృద్ధి రేటుతో భారత ఆర్థిక రంగానికి వెనుదన్నుగా నిలిచిన వ్యవసాయంపై కూడా ఆర్థిక మంత్రిగా గట్టిగా దృష్టిసారించారు. వ్యవసాయరంగానికి అందులోనూ భారత రైతాంగానికి ఆయన ఏం మేలు చేయబోతున్నారనే దానికంటే కూడా వ్యవసాయరంగంలో కార్పొరేట్ల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు యథాశక్తి ప్రయత్నిస్తున్నారన్న విషయం విస్పష్టంగా కనిపిస్తున్నది. కార్పొరేట్ ఉనికి పొలంగట్ల వరకు చేరింది.

ఇక పొలాల్లోకి ప్రవేశించమే తరువాయిగా కనిపిస్తున్నది. నిజానికి ఈ బడ్జెట్‌లో స్టాక్ మార్కెట్‌లను ఘనంగా అలరించే అంశాలు ఏమీ లేవు. అయితే గత కొద్దికాలం గా మార్కెట్‌లో కనిపిస్తున్న నీరస వాతావరణంలో ప్రతికూల అంశాలు పెద్దగా లేకపోవడమే బడ్జెట్‌లో సానుకూల అంశంగా భావించి స్టాక్ మార్కెట్లు సోమవారం నాడు పెరిగినట్టుగా కనిపిస్తున్నది. ఇది తక్షణ స్పందనగానే భావించాలి.

బడ్జెట్ ప్రతిపాదనల ప్రభావాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మార్కెట్ల స్పందనలో తేడా ఉండే అవకాశం ఉంది. ద్రవ్యలోటు అదుపునకు సంబంధించి, ద్రవ్యోల్బణానికి సంబంధించి ఆర్థికమంత్రి లక్ష్యాలు ఎంతవరకు ఆచరణ సాధ్య మో వేచిచూడాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మన చేతు ల్లో లేవన్న విషయం విషయం గుర్తించాలి. అదే విధంగా మధ్య ఆసియాలోని సంక్షోభ పరిస్థితులు కూడా. వీటి ప్రభావం నుంచి దేశీయ ఆర్ధికరంగం తప్పించుకోవడం సాధ్యం కాదు.

మార్కెట్ వర్గాలు గట్టిగా కాంక్షించిన సంస్కరణల విషయంలో కూడా ఆర్ధిక మంత్రి చొరవ తీసుకోలేదు. మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించే విషయం, బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపరిమితిని పెంచే విషయం ప్రస్తుతానికి దాటవేశారు. రాబడిని పెంచుకునేందుకు సర్వీసులరంగంపై పడ్డారు. పన్నును పెంచకుండానే కొత్త సర్వీసులను పన్ను పరిధిలోకి తెచ్చారు.

ఎయిర్ కండిషన్ బార్లు, ఆస్పత్రులు, హోటళ్లు, రోగనిర్ధారణ సర్వీసులను పన్ను పరిధిలోకి తెచ్చిన కారణంగా ఈ భారం అనివార్యంగా మధ్యతరగతిపైనే పడుతుంది. ఎక్సైజ్ సుంకాల విషయంలోనూ ఉపేక్షిస్తున్నట్టుగా పైకి కనిపిస్తూనే వడ్డనలకు దిగారు. కేంద్ర ఎక్సైజ్, రాష్ట్రాల వాట్ నుంచి మినహాయింపు ఉన్న 130 వస్తువులను పన్ను పరిధిలోకి తెచ్చారు. ఎక్సైజ్ సుంకాల గరిష్ఠ పరిమితిని 10 శాతంగా కొనసాగిస్తూనే కనిష్ఠ పరిమితిని 4 నుంచి 5 శాతానికి హెచ్చించారు.

ఇటీవల కాలంలో విస్తృత వినియోగంలోకి వచ్చిన రెడిమేడ్ దుస్తుల పరిశ్రమను పన్ను పరిధిలోకి తెచ్చారు. ఎరువులు, ఎల్‌పిజి, కిరోసిన్‌కు సబ్సిడీలను నగదురూపంలో బదిలీ చేయాలన్న విధానం భవిష్యత్తులో మధ్యతరగతిని సబ్సిడీలకు దూరం చేస్తుంది. కేవలం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే సబ్సిడీలను నగదు రూపంలో అందజేసే అవకాశం ఉంటుంది. భవిష్యత్‌లో ఇది పెను భారమే చూపించే అవకాశం ఉంది. ఏ రకంగా చూసినా ప్రణబ్ దాదా బడ్జెట్ పైకి కనిపిస్తున్నంత జనాకర్షకం మాత్రం కాదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి